శివసేన పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఊర్మిళ స్పందన

30-11-2020 Mon 19:56
  • కంగనకు పోటీగా ఊర్మిళ అంటూ ప్రచారం
  • ఉద్ధవ్ థాకరే సమక్షంలో పార్టీలో చేరనుందని కథనాలు
  • మీడియా ప్రచారాన్ని ఖండించిన ఊర్మిళ
Urmila clarifies the speculations that she will join Shivsena

కంగనా రనౌత్ కు పోటీగా శివసేన పార్టీ నటి ఊర్మిళ మటోండ్కర్ ను తీసుకువస్తోందంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సీఎం ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ శివసేన కండువా కప్పుకుంటుందన్న వార్తలు వినిపించాయి. దీనిపై ఊర్మిళ స్పందించారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ కథనాలను ఖండిస్తున్నానని వెల్లడించారు. తాను శివసేన పార్టీలో చేరడంలేదని కరాఖండిగా చెప్పేశారు.

ఊర్మిళకు రాజకీయాలు కొత్త కాదు. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగారు. ముంబయి నార్త్ పార్లమెంటు స్థానంలో పోటీ చేసిన ఆమె ఓటమిపాలయ్యారు. అనంతరం ఆమె కాంగ్రెస్ కు దూరమయ్యారు.

మళ్లీ ఇన్నాళ్లకు ఆమె శివసేనలో చేరబోతున్నారని, గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ అవకాశం కూడా ఇవ్వబోతున్నారని తాజాగా కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని సీఎం ఉద్ధవ్ థాకరే సన్నిహితుడు హర్షల్ ప్రధాన్ తెలిపినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే, ఆ కథనాల్లో వాస్తవంలేదని తన వ్యాఖ్యల ద్వారా ఊర్మిళ తేల్చి చెప్పారు.