Antibodies: ముంబయి మురికివాడల్లో ఆశ్చర్యకర రీతిలో కరోనా యాంటీబాడీల గుర్తింపు

  • సర్వే చేపట్టిన ఐబెట్స్, హర్షిత నర్వేకర్
  • 75 శాతం మందిలో యాంటీబాడీలు
  • అత్యధికుల్లో లక్షణాలు లేకుండానే కరోనా
Antibodies found in a Mumbai slum area people

కరోనా రోగులు కోలుకున్న తర్వాత వారిలో ఏర్పడే యాంటీబాడీల విషయమై ఇటీవలే ముంబయిలో ఓ సర్వే నిర్వహించారు. కఫే పరేడ్ ప్రాంతంలోని 5 మురికి వాడల్లో ఈ సర్వే నిర్వహించగా, అందులో వెల్లడైన ఫలితాలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. దాదాపు 75 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయట.

మొత్తం 806 మందిని పరీక్షించగా, వారిలో 605 మందిలో యాంటీబాడీలు గుర్తించారు. వీళ్లలో ఓ ఎనిమిది మంది మాత్రమే తమకు గతంలో కరోనా సోకిందన్న విషయాన్ని పంచుకున్నారు. చాలామందికి లక్షణాలు లేకుండానే కరోనా వచ్చి పోయుంటుందని భావిస్తున్నారు. ఇక, కొందరు వైరస్ బారినపడిన వారు ఆ విషయం వెల్లడించేందుకు ముందుకు రాలేదు. బీజేపీ కార్పొరేటర్ హర్షిత నర్వేకర్, ఐబెట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి.

 ముఖ్యంగా, 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో 76 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయట. అత్యధికుల్లో యాంటీబాడీలు ఉన్నా, మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని బీజేపీ కార్పొరేటర్ హర్షిత నర్వేకర్ పేర్కొన్నారు. గతంలో బీఎంసీ ఇలాంటిదే ఓ సీరో ప్రివలెన్స్ సర్వే నిర్వహించగా, ఓ మురికివాడలో 45 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించారు. యాంటీబాడీల రేటు పురుషుల్లో కంటే మహిళల్లోనే అత్యధికంగా ఉందని తాజాగా ఐబెట్స్, హర్షిత నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

More Telugu News