ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు: చంద్రబాబు

30-11-2020 Mon 18:44
  • గాలికి వచ్చిన వారు గాలికే పోతారు
  • అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
  • నా అనుభవమంత లేదు జగన్ వయసు
Fake fellows are playing with AP state says Chandrababu

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక ఫేక్ సీఎం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ఫెలోస్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా గాలికి వచ్చారని, గాలికే పోతారని అన్నారు. శాసనసభ నియమాలకు విరుద్ధంగా సభను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా...  తమపై వెకిలి కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. వరదలు, పంట నష్టంపై గాలి కబుర్లు చెపుతున్నారని విమర్శించారు. ఏడాది పాలనలో లక్షా 25 వేల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడటం కరెక్టేనా? అని ప్రశ్నించారు.

తన జీవితంలో తాను ఇంతవరకు జైలుకు పోలేదని చంద్రబాబు అన్నారు. జగన్ గాల్లో తిరుగుతూ గాలి మాటలు చెపుతున్నారని... అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రీమియంలు కట్టకుండా పంటల బీమా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ప్రీమియంలు కట్టకపోతే రైతుకు బీమా డబ్బులు రావని అన్నారు. జగన్ చేతకానితనం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఏ పూనకంలో ఉండి జనాలు ఓటేశారో కానీ... జగన్ సీఎం అయిపోయారని అన్నారు. తన అనుభవమంత వయసు కూడా జగన్ కు లేదని... సొంత బీమా పెడతామని తనకే కబుర్లు చెపుతారా? అని మండిపడ్డారు.

అమరావతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైజాగ్ లో చేస్తున్నది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా? అని ప్రశ్నించారు. బుల్లెట్ దిగిందా? అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వైయస్సార్ ఇదే విధంగా మాట్లాడితే తాను 'మైండ్ యువర్ టంగ్' అని హెచ్చరించానని చెప్పారు. వైయస్సార్ కు ప్రజల పట్ల భయం ఉందని... కానీ జగన్ కు అది లేదని విమర్శించారు. తాము ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని... ఈరోజు అధికారంలో ఉన్నవారికి రేపు తమలాంటి పరిస్థితే రావచ్చని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు.