Trinetra Haldar Gummaraju: త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు... మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ డాక్టర్!

Trinetra Haldar Gummaraju becomes the first doctor in transgender community
  • ఓ ట్రాన్స్ ఉమన్ అద్భుత ప్రస్థానం
  • ఛీత్కారాలను ఎదుర్కొని డాక్టర్ అయిన వైనం
  • సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్
సమాజంలో ట్రాన్స్ జెండర్లపై వివక్ష ఈనాటిది కాదు. అయితే, త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు అనే ట్రాన్స్ జెండర్ వివక్షను ఓ సవాల్ గా తీసుకుని ఎదిగిన వైనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్ ఉమన్ గా మారిన త్రినేత్ర ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. కర్ణాటకకు చెందిన త్రినేత్ర అసలు పేరు అంగద్ గుమ్మరాజు. స్వస్థలం బెంగళూరు. అయితే తనలో స్త్రీ లక్షణాలు అధికంగా ఉన్నాయని భావించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. అంగద్ అనే తన పాత పేరును తొలగించి, తల్లిపేరు కలిసొచ్చేలా త్రినేత్ర అని మార్చుకుంది.

బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసిన త్రినేత్ర మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇంటర్న్ షిప్ చేస్తోంది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో మొట్టమొదటి డాక్టర్ గా ఖ్యాతి పొందింది. త్రినేత్ర సోషల్ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. తన జీవన ప్రస్థానం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. సోషల్ మీడియాలో ఈ ట్రాన్స్ ఉమన్ డాక్టర్ కు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

తనను ఎంతో అసభ్యకర రీతిలో వేధించేవారని, అవమానకరంగా పిలిచేవారని, అయితే వాటన్నింటినీ అధిగమించి చదువుపై దృష్టి నిలిపి అనుకున్నది సాధించానని త్రినేత్ర మీడియాకు తెలిపింది. ఇటీవల తాను ఇంటర్న్ షిప్ చేస్తున్న ఆసుపత్రిలో ఓ ప్రసవం చేసి శిశువును చేతుల్లోకి తీసుకున్న క్షణాలు మరపురానివని పేర్కొంది.
Trinetra Haldar Gummaraju
Doctor
MBBS
Transgender
Banglore
Karnataka

More Telugu News