టీడీపీకి అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదు: మంత్రి కన్నబాబు విమర్శలు

30-11-2020 Mon 14:45
  • రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశాడన్న కన్నబాబు
  • రైతులకిచ్చిన ప్రతిహామీ నెరవేర్చుతున్నామని వెల్లడి
  • చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
Kannababu criticizes Chandrababu in Assembly session

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీకి అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదని అన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. కానీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారని కొనియాడారు.

వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారని కన్నబాబు వివరించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. డిసెంబరు నెలాఖరు నాటికి వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ స్వయంగా ఏరియల్ సర్వేలు నిర్వహిస్తుంటే... గాలి సర్వేలంటూ చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హుద్ హుద్ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్టు చంద్రబాబు పోజులిచ్చారని, అలా నటించడం తమ సీఎంకు చేతకాదని కన్నబాబు తెలిపారు.