ఆ రెండు పార్టీల వాళ్లు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు.. పట్టించుకోరేం?: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

30-11-2020 Mon 13:32
  • ఓట్ల కోసం గత రాత్రి నుంచి టీఆర్ఎస్, ఎంఐఎం ప్రలోభాలు
  • డబ్బులు పంచుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదు
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ టీఆర్ఎస్‌కు అనుకూలం
raja singh slams trs mim

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార హడావుడి ముగిసిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు బీజేపీ తరఫున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు ఆయన టీఆర్ఎస్, ఎంఐఎం నేతలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘంపై కూడా పలు ఆరోపణలు చేశారు.

ఓట్ల కోసం గత రాత్రి నుంచి టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, డబ్బులు పంచుతున్నారని తెలిపారు. వారు బహిరంగంగా డబ్బులు పంచుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అంతేగాక, ఆయా పార్టీల నేతలకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.

మరోవైపు, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు అనవసరంగా లాఠీచార్జీలు చేస్తున్నారని అన్నారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు పలు డివిజన్‌లలో వారిపై దాడులు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించకుండా టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందని ఆరోపణలు గుప్పించారు.