వారణాసికి వెళుతున్న అల్లు అర్జున్!

30-11-2020 Mon 13:17
  • సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా 'పుష్ప'
  • మారేడుమిల్లిలో యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ
  • డిసెంబర్ 18 నుంచి వారణాసికి యూనిట్ 
  • అక్కడ ఒక పాట, సన్నివేశాల చిత్రీకరణ   
Allu Arjun will go to Varanasi for shoot

మొన్న సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ కొట్టాడు. తదుపరి చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్.. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో కొంత జరుపుకుంది. అక్కడ బన్నీపై కొన్ని యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించారు.

ఇక తిరిగి తదుపరి షెడ్యూలును డిసెంబర్ 18 నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూలుని వారణాసిలో నిర్వహిస్తారని తెలుస్తోంది. అక్కడ ఒక పాటను, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. కాశీ బ్యాక్ డ్రాప్ లో ఆ పాటను చిత్రీకరించాల్సి ఉన్నందున అక్కడికి వెళుతున్నారట.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో పుష్పరాజ్ అనే డ్రైవర్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఆయన సంరసన రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఆమె ఇందులో గిరిజన యువతి పాత్రలో కనిపిస్తుందట. సుకుమార్ చిత్రాలకు ఎప్పుడూ సంగీతాన్ని సమకూర్చే దేవిశ్రీ ప్రసాద్ దీనికి కూడా సంగీతాన్ని ఇస్తున్నాడు.