ఉత్తరప్రదేశ్‌ లో దారుణం.. జర్నలిస్ట్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనం

30-11-2020 Mon 12:39
  • బలరాంపూర్ లో దారుణ ఘటన
  • ఇంటికి  నిప్పంటించిన దుండగులు
  • జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు సజీవదహనం
Journalist set on fire in Uttarpradesh

అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు సజీవదహనం చేశారు. ఈ ఘటన బలరాంపూర్ టౌన్ లో చోటుచేసుకుంది.

రాకేశ్ సింగ్ అనే వ్యక్తి బలరాంపూర్ లో విలేకరిగా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఒక ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రాకేశ్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు కూడా సజీవదహనం అయ్యాడు. ఘటన జరిగిన సమయంలో రాకేశ్ సింగ్ భార్య, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులందరినీ పిలిపించుకుని విచారిస్తున్నారు. జర్నలిస్టు భార్యకు పరిహారంగా అధికారులు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాదు, బలరాంపూర్ షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కేసును దర్యాప్తు చేసేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.