ఆసీస్‌కు షాక్‌.. గాయంతో జట్టుకు డేవిడ్ వార్నర్ దూరం

30-11-2020 Mon 12:16
  • టీమిండియాతో మిగిలిన వన్డేకు దూరం
  • మూడు టీ20ల సిరీస్‌ నుంచి కూడా ఔట్
  • తొడ పై భాగంలో గాయం  
david warner ruled out from t20 series

టీమిండియాతో మిగిలిన వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా దూరమయ్యాడు. తొడ పై భాగంలో గాయం కారణంగా డేవిడ్ వార్నర్‌ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నాడు. అంతేగాక, ఆయన టెస్టు సిరీస్‌లో ఆడగలడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన తప్పుకోవడంతో టీ20 సిరీస్‌కు వార్నర్‌ స్థానంలో డీ ఆర్సీ షార్ట్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఇచ్చిన భారీ పరుగుల లక్ష్యాన్ని టీమిండియా బ్యాట్స్ మెన్ ఛేదించలేకపోయారు.  నిన్నటి మ్యాచ్‌లో వార్నర్‌ 83 పరుగులు చేసి, తమ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. నిన్నటి మ్యాచ్ లో ఫీల్డింగ్‌ చేసే సమయంలో ఆయనకు గాయమైంది.