Joe Biden: బడ్జెట్ చీఫ్ గా ఇండో అమెరికన్ నీరా టాండన్ ను ఎంచుకున్న జో బైడెన్!

  • సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న నీరా టాండన్ 
  • సిసిలా రౌజ్ కు ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి అప్పగింత
  • ఓబామా టీమ్ లో క్రియాశీలకంగా ఉన్న వారికి ఉన్నత పదవులు
Biden Chooses Indo American for Budget Chief

ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న ఇండో అమెరికన్ నీరా టాండన్ ను బడ్జెట్ చీఫ్ గా నియమిస్తున్నట్టు జో బైడెన్ తెలియజేశారు.ఈ మేరకు ఆమెకు మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ పదవిని కాబోయే అధ్యక్షుడు ఇవ్వనున్నారని అమెరికన్ మీడియా వెల్లడించింది. బరాక్ ఒబామా యూఎస్ కు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెల్త్ కేర్ విభాగంలో నీరా బాధ్యతలు నిర్వహించారు. ఆపై నాలుగేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున ట్రంప్ ను సవాల్ చేసిన హిల్లరీ క్లింటన్ కు సలహాదారుగానూ సేవలందించారు.

ఇదే సమయంలో ప్రముఖ ఆర్థికవేత్త సిసిలా రౌజ్ ను ఆర్థిక వ్యవహారాల సలహాదారుల మండలి చైర్ పర్సన్ గా బైడెన్ ఎంచుకున్నారని 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఒబామా హయాంలో అంతర్జాతీయ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన ప్రముఖ ఆర్థిక వేత్త వాలీ అడెయోమోను కూడా తన టీమ్ లోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరో ఆర్థిక వేత్త జానెట్ ఎల్ మెలెన్ కు ట్రెజరీ బాధ్యతలను, తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న వేళ సలహాదారుగా ఉన్న జారేడ్ బెర్న్ స్టీన్, హైదర్ బౌలీలను కూడా ఆర్థిక సలహా మండలిలో బైడెన్ నియమించుకోనున్నారని సమాచారం.

ఇదిలావుండగా, ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బంది, 2009లో లీమన్ బ్రదర్స్ పతనం తరువాత ఏర్పడిన సంక్షోభాన్ని గుర్తుకు తెస్తుండగా, నాటి అధ్యక్షుడు ఒబామా టీమ్ లో కీలకంగా పనిచేసి, కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేసిన అందరినీ బైడెన్ ప్రస్తుతం తన టీమ్ లో తీసుకుంటుండటం గమనార్హం. వీరి నేతృత్వంలోనే కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు, పంపిణీ, సంక్షోభ నివారణ, ఉద్దీపనలకు బైడెన్ ప్రణాళికలు రూపొందిస్తారని తెలుస్తోంది.

More Telugu News