మరిన్ని విమానాలు కొనాలని నిర్ణయించిన ఎయిర్ ఆసియా!

30-11-2020 Mon 11:24
  • జూన్ లోగా మూడు ఏ 320 నియో విమానాలు
  • సరఫరా చేయనున్న ఎయిర్ బస్
  • ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునే ప్రయత్నాల్లో సంస్థ
Air Asia to Induct More Flights

తక్కువ ధరకు విమాన ప్రయాణ సేవలందిస్తున్న ఎయిర్ ఆసియా, తన విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మరిన్ని విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎయిర్ బస్ నుంచి మూడు ఏ320 నియో విమానాలను వచ్చే జూన్ నాటికి తీసుకుని తమ నెట్ వర్క్ ను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించింది. టాటా సంస్థ, మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అయిన ఈ విమానయాన సంస్థ ఇండియాలో 32 విమానాలతో వివిధ నగరాల మధ్య ప్రయాణ సేవలందిస్తోంది.

ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన ఎయిర్ ఆసియా, ఏ 320 నియో విమానాలను కొనుగోలు చేయాలని గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నామని, అయితే, కరోనా కారణంగా విమానాల డెలివరీ అలస్యం అయిందని స్పష్టం చేసింది. బెంగళూరు కేంద్రంగా ఎయిర్ ఆసియా కార్యకలాపాలు సాగుతుండగా, తొలి ఏ 320 నియోను అక్టోబర్ లో, ఆపై రెండో విమానాన్ని ఈ నెల ప్రారంభంలో డెలివరీ తీసుకుంది. 

మూడవ విమానం డిసెంబర్ లో డెలివరీ కానుందని, ఆపై జూన్ నాటికి మిగతా విమానాలు చేతికందుతాయని సంస్థ ఎండీ అండ్ సీఈఓ సునీల్ భాస్కరన్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఇండియాలో తాము పెట్టిన పెట్టుబడులను ఈ నెల 17న సమీక్షించిన మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా బెర్హాద్, మరిన్ని విమానాలను తన ఫ్లీట్ లో చేర్చేందుకు అంగీకరించింది. ప్రస్తుతం సంస్థ విమానాలు సగటున 70 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయని, దీన్ని మరింతగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ పేర్కొంది.