కరోనాతో కన్నుమూసిన రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరి!

30-11-2020 Mon 10:32
  • రాజ్ సమంద్ ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వరి
  • ఇటీవల కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స
  • తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చిన నేతలు
BJP MLA Dies with Corona

రాజస్థాన్ బీజేపీ మహిళా నేత, రాజ్ సమంద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె వయసు 49 సంవత్సరాలు. ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్ రాగా, అప్పటి నుంచి గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె శరీరంలోని పలు అవయవాలు విఫలమై మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి.

రాజ్ సమంద్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, రాజస్థాన్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె మరణవార్తను తెలుసుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా తదితరులు తమ సంతాపాలను వ్యక్తం చేశారు. ఆమె మరణం రాష్ట్ర బీజేపీకి తీరని లోటని వ్యాఖ్యానించారు.