Tamil Nadu: మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. తమిళనాడులో రెడ్ అలెర్ట్

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రెండు రోజుల ముందుగానే అప్రమత్తమైన ప్రభుత్వం
  • ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
central committee visits Tamil Nadu today

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుండడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయుగుండం ప్రభావంతో  డిసెంబరు 2న అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్‌కు సమీపంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం నిన్న మరింత బలపడింది.

ఇది నేడు మరికాసేపట్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రేపు సముద్ర తీర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడనుండగా, ఎల్లుండి అన్ని జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. రేపు ఇది ‘బురేవి’ తుపానుగా మారి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రెండు రోజుల ముందుగానే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  

మరోవైపు, నివర్ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు నేడు తమిళనాడుకు కేంద్ర బృందం రానుంది.  కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడుగురు అధికారుల బృందం రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ అవుతుంది. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామితో భేటీ కానుంది.

More Telugu News