నాపై ఎందుకు దాడికి యత్నించాడో తెలియదు: పేర్ని నాని

29-11-2020 Sun 13:32
  • నా తల్లి పెద్ద కర్మలో భాగంగా పూజ చేసి వస్తుండగా దాడి
  • బలరామపేటకు చెందిన ఓ వ్యక్తి దాడికి యత్నించాడు
  • అతడి చేతిలోని తాపీ నా ప్యాంటుకు తగిలింది
  • రెండో సారి కూడా దాడికి యత్నించాడు
perni nani about attack on him

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై పేర్ని నాని స్పందిస్తూ పలు వివరాలు తెలిపారు. తన తల్లి పెద్ద కర్మలో భాగంగా పూజ చేసి వస్తుండగా దాడికి ఓ వ్యక్తి ప్రయత్నించాడని  చెప్పారు. భోజన ఏర్పాట్లు చేయడంతో తన ఇంటికి చాలా మంది వచ్చారని చెప్పారు.

తనపై బలరామపేటకు చెందిన ఓ వ్యక్తి దాడికి యత్నించాడని తెలిపారు. అతడి చేతిలోని తాపీ తన ప్యాంటుకు తగిలిందని చెప్పారు. అనంతరం రెండో సారి కూడా తనపై దాడికి యత్నించాడని అన్నారు. తాను అప్రమత్తంగా ఉండడంతో తాను గాయపడలేదని తెలిపారు. తనపై ఎందుకు దాడికి యత్నించాడో తనకు తెలియదని తెలిపారు.

దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించామని పేర్ని నాని అన్నారు. కాగా, నిందితుడిని మచిలీపట్నానికి చెందిన తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. అతడు దాడి చేయడానికి కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.