New Delhi: ఒక్క నెలలో ఢిల్లీ ప్రజలందరికీ వ్యాక్సిన్... స్టోరేజ్ కేంద్రంగా రాజీవ్ గాంధీ హాస్పిటల్!

  • అనుమతులు లభించగానే టీకా ఇస్తాం
  • మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి
  • వెల్లడించిన ఢిల్లీ ఇమ్యునైజేషన్ ఆఫీసర్
Vaccine to All Delhi People in One Month

ఇండియాలో ఒకసారి వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లభిస్తే, ఢిల్లీలోని ప్రజలందరికీ ఒకేసారి టీకాను అందిస్తామని ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సురేశ్ సేథ్ వెల్లడించారు. వ్యాక్సిన్ ను స్టోర్ చేసేందుకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇప్పటికే ప్రత్యేక అనుమతులు ఇచ్చామని వెల్లడించిన ఆయన, మొత్తం ప్రజలందరికీ కేవలం ఒక్క నెల వ్యవధిలో టీకాను అందిస్తామని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులూ హస్తినలో ఉన్నాయని అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, తొలి మూడు రోజుల్లోనే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు ఇస్తామని ఆయన అన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం 600 కోల్డ్ స్టోరేజ్ పాయింట్లను, 1,800 ఔట్ రీచ్ సైట్స్ ను సిద్ధం చేశామని, వెల్లడించిన ఆయన, చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను అందిస్తామని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో స్కూల్ క్యాంపస్ లను కూడా భాగం చేయనున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో వైద్య చికిత్సలు అందిస్తున్న ప్రతి ఒక్కరి జాబితాను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. వ్యాక్సిన్ ను మైనస్ రెండు నుంచి ఎనిమిది డిగ్రీల వద్ద స్టోర్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మైనస్ 20 డిగ్రీల వరకూ కావాలన్నా వ్యాక్సిన్ ను నిల్వ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

More Telugu News