Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ లో రియాక్షన్... సీరమ్ పై రూ. 5 కోట్లకు దావా!

  • వ్యాక్సిన్ కు వలంటీర్ గా ఉన్న 40 ఏళ్ల వ్యక్తి
  • వెంటనే ట్రయల్స్ నిలిపివేయాలని డిమాండ్
  • ప్రొటోకాల్ ప్రకారం చికిత్సను అందిస్తున్నామన్న చెన్నై హాస్పిటల్
  • వ్యాక్సిన్ కారణంగా మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని వెల్లడి
Covishield vaccine volunteer sues Serum Institute for Reaction

ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికాలు తయారు చేయగా, పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ జరుపుతున్న ట్రయల్స్ లో పాల్గొన్న తనకు తీవ్రమైన రియాక్షన్స్ వచ్చాయని, తనకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ, 40 ఏళ్ల 'కొవిషీల్డ్' వాలంటీర్ కోర్టును ఆశ్రయిస్తూ, దావా వేశాడు. తనలో నరాల బలహీనత ఏర్పడిందని, తానింక సాధారణ జీవితాన్ని గడిపే పరిస్థితి లేదని తన పిటిషన్ లో ఆయన వాపోయాడు.

ఈ మేరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ కు లీగల్ నోటీసును పంపిన అతను, వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా తనతో పాటు 1,600 మందికి టీకాను ఇచ్చారని, ఈ ట్రయల్స్ ను వెంటనే నిలిపివేయాలని అతను డిమాండ్ చేశాడు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తనలో విటమిన్ బీ12, విటమిన్ డీ లోపాలు సంభవించాయని టిష్యూ లోపాలు కూడా వచ్చాయని తన నోటీసులో ఆరోపించాడు.

కాగా, ఈ వలంటీర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా, అతనికి వ్యాక్సిన్ అందించి పరిశీలించిన డాక్టర్ ఎస్ఆర్ రామకృష్ణన్ ఈ విషయంపై స్పందిస్తూ, అతని ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. అతను రికవర్ అయ్యాడని, ప్రొటోకాల్ ప్రకారం అతనికి చికిత్సను అందిస్తున్నామని, మిగతావారిలాగే అతని వైద్య ఖర్చులకు సంబంధించిన అన్ని వ్యయాలనూ ఆసుపత్రే భరిస్తోందని స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని డీసీజీఐ (డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా)కు నివేదిక రూపంలో ఇచ్చామని, ఈ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగా మాత్రమే అతనికి రియాక్షన్స్ రాలేదని ఆసుపత్రి ఎథిక్స్ కమిటీ ఓ రిపోర్టును ఇచ్చిందని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొనడం గమనార్హం. ఈ విషయంపై ఇంకా సీరమ్ ఇనిస్టిట్యూట్ మాత్రం స్పందించలేదు.

ఇదే విషయంలో బాధితుడి భార్య స్పందిస్తూ, తన భర్త, వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు సంతకం చేశాడని, ప్రజలకు మేలు కలగాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రాణాలపైకి తెచ్చిందని వాపోయారు. చెన్నైలోని శ్రీ రామచంద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో వ్యాక్సిన్ వేశారని, ఆపై పట్టించుకోలేదని, తీవ్రమైన దుష్పరిణామాలు తలెత్తినా, చికిత్స చేయలేదని ఆరోపించడం గమనార్హం.

More Telugu News