పాలకులు దేవాదాయ ఆస్తుల జోలికి వెళ్లకుండా పటిష్ట చట్టాలు చేయాలి: పవన్ కల్యాణ్

28-11-2020 Sat 21:28
  • దేవాదాయ ఆస్తులు విక్రయించొద్దంటూ పవన్ స్పష్టీకరణ
  • తాత్కాలిక ప్రకటనలు వద్దన్న పవన్
  • జగన్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేయాలంటూ ప్రకటన
Pawan Kalyan wants stricter acts on endowment lands

దేవాదాయ ఆస్తులు ప్రభుత్వం విక్రయించాలని చూస్తే భక్తుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వ్యవహారం ద్వారా మరోమారు రుజువైందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మఠానికి చెందిన 208 ఎకరాల భూమి వేలాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడాన్ని ఇందులో భాగంగానే చూడాలని తెలిపారు. గతంలో టీటీడీ ఆస్తుల అమ్మకం, శ్రీవారి సొమ్మును ప్రభుత్వ బాండ్ల రూపంలో మళ్లించాలన్న నిర్ణయాల విషయంలో కూడా భక్తుల నుంచి వచ్చిన నిరసనల వల్లే ప్రభుత్వం వెనక్కి వెళ్లిందని వెల్లడించారు.

పాలకులు దేవాదాయ, ధర్మాదాయ భూములు, ఇతర ఆస్తులను విక్రయించే వీల్లేకుండా పకడ్బందీ చర్యలు అవసరం అని స్పష్టం చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మాలనుకున్నప్పుడో, మఠం భూములు వేలం వేయాలనుకున్నప్పుడో భక్తులు నిరసనలు తెలుపగానే నిలిపివేస్తున్నాం అంటూ తాత్కాలిక ప్రకటనలతో సరిపెట్టకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆలయాలు, ధర్మ సత్రాలు, మఠాలకు చెందిన భూములకు సంబంధించి ప్రభుత్వం కేవలం సంరక్షణదారుగా ఉండేలా చట్టం రూపొందించాలని, ఆస్తులను అమ్ముకునే అధికారం పాలకులకు ఉండరాదని పేర్కొన్నారు. ఆస్తులను పరిరక్షించలేకపోతున్నాం అనే ప్రభుత్వ వాదనలో పసలేదని, రెవెన్యూ, పోలీస్ సహా అన్ని శాఖలు ప్రభుత్వ అధీనంలో ఉంటాయని, అలాంటి ప్రభుత్వం దేవుడి మాన్యాలను ఎందుకు కాపాడలేకపోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని పవన్ వ్యాఖ్యానించారు.

జగన్ రెడ్డి ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే తాత్కాలిక ప్రకటనలు కాకుండా దేవాదాయ ఆస్తులు అమ్మే వీల్లేకుండా చట్టం చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.