వెండితెరకు ప్రముఖ పారిశ్రామికవేత్త కథ.. హీరోగా మాధవన్?

28-11-2020 Sat 21:28
  • బయోపిక్ లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ
  • 'ఆకాశం నీ హద్దురా'కు మంచి స్పందన
  • రతన్ టాటా బయోపిక్ కి సన్నాహాలు     
Madhavan to play Ratan Tata

ఇటీవలి కాలంలో వివిధ భాషల్లో పలు బయోపిక్ లు నిర్మాణం అవుతున్నాయి. ప్రముఖుల జీవిత కథలను ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరిస్తే కనుక ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సూర్య కథానాయకుడుగా వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. తక్కువ రేట్లకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా ఆ చిత్రం రూపొందింది.

మరోపక్క, ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే '83' పేరుతో క్రికెటర్ కపిల్ దేవ్ కథ తెరకెక్కుతోంది. ఈ క్రమంలో మరో బయోపిక్ నిర్మాణం జరగనున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సంస్థల అధినేత రతన్ టాటా జీవితకథ వెండితెరకు ఎక్కనుంది.

ఇందులో టైటిల్ రోల్ ను ప్రముఖ నటుడు మాధవన్ పోషించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజక్టు ప్రాథమిక దశలో వుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అవుతాయి.