మల్కాజ్ గిరిలో యూపీ సీఎం ఆదిత్య నాథ్ రోడ్ షో... భారీ జనసందోహం!

28-11-2020 Sat 17:11
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరాహోరీ
  • జాతీయ నాయకులతో బీజేపీ ప్రచారం
  • యోగి రాకతో నగర బీజేపీలో ఉప్పొంగిన ఉత్సాహం
Yogi Adithyanath Roadshow in Hyderabad

దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించేందుకు బీజేపీ శ్రేణులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ జాతీయ నాయకులు సైతం హైదరాబాదులో ప్రచారం చేస్తున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా భాగ్యనగరంలో అడుగుపెట్టారు. బీజేపీ శ్రేణులను మరింత ఉత్సాహపరిచేలా ఆయన మల్కాజ్ గిరి తదితర ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు.

యోగి రాకతో నగర కాషాయ కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగింది. యోగి రోడ్ షోలకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రోడ్లు క్రిక్కిరిసి పోయాయి. అంతకుముందు, హైదరాబాద్ విచ్చేసిన యోగి ఆదిత్యనాథ్ కు సంప్రదాయ వాయిద్యాలు, నాట్య ప్రదర్శనలతో నగర బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు.