'ఆదిపురుష్' నాయికగా కృతి సనన్.. బాలీవుడ్ మీడియాలో వార్తలు!

28-11-2020 Sat 16:59
  • నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ 
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • రాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్
  • జనవరి నుంచి షూటింగ్ నిర్వహణ  
Kriti sanon as heroine in Adipurush

నేషనల్ స్టార్ గా రూపాంతరం చెందిన టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించే తొలి డైరెక్ట్ హిందీ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడిన దగ్గర నుంచీ సంచలనం రేపుతోంది. అటు ఆర్టిస్టుల పరంగా ఇప్పటికే ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. విలన్ లంకేశ్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ఇక సినిమాలో కీలక పాత్ర అయిన హీరోయిన్ సీత పాత్ర విషయమై మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కీర్తి సురేష్.. అనుష్క శెట్టి.. అనుష్క శర్మ.. ఇలా ఎన్నో పేర్లు వార్తలలో వినిపించాయి. అయితే, ఈ సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎంపిక ఇప్పటికే పూర్తయిందని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వార్తలొస్తున్నాయి.

చెడుపై మంచి సాధించే విజయమే ప్రధానాంశంగా ఈ చిత్ర కథ సాగుతుంది. నాటి రామాయణాన్ని సోషియో ఫాంటసీ కథగా మార్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగును నిర్వహించి, మూడు నెలల్లోనే పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇందులో వీఎఫ్ఎక్స్ కి అధిక ప్రాధాన్యత ఉండడంతో ఆ పనులకు ఎక్కువ సమయం పట్టేలా వుంది.