ఆసీస్ తో తొలి వన్డేలో కోహ్లీ సేనపై జరిమానా వడ్డన

28-11-2020 Sat 16:22
  • సిడ్నీ మ్యాచ్ లో ఆసీస్ జయకేతనం 
  • స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడిన భారత్
  • తప్పిదాన్ని అంగీకరించిన కోహ్లీ 
  • మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత
Team India fined for slow overrate in Sydney ODI

ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన నిన్నటి నుంచి షురూ అయింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా జరిమానాకు గురైంది. కోహ్లీ సేన స్లో ఓవర్ రేట్ నమోదు చేసినట్టు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. 50 ఓవర్లను 210 నిమిషాల్లో ముగించాల్సి ఉండగా, టీమిండియా మరో 36 నిమిషాల అదనపు సమయం తీసుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్లను ఊచకోత కోయడంతో ఫీల్డింగ్ సెట్ చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ సమయం తీసుకున్నాడు.

ఈ తప్పిదాన్ని కోహ్లీ అంగీకరించడంతో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ టీమిండియా ఖాతాలో జమ అయింది. కోహ్లీ వాదనలు వినిపించే అవకాశం ఉన్నా, తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే జరిమానా నిర్ణయం ప్రకటించారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన చేసింది.