హైదరాబాదులో భారత్ బయోటెక్ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

28-11-2020 Sat 15:11
  • కరోనా వ్యాక్సిన్ పరిశోధనలను పరిశీలిస్తున్న మోదీ
  • ఈ మధ్యాహ్నం హైదరాబాద్ రాక
  • భారత్ బయోటెక్ లో మోదీకి ఘనస్వాగతం
PM Modi visits Bharat Biotech corona vaccine development facility

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పరిశోధనల తీరుతెన్నులను పరిశీలిస్తున్న ఆయన హైదరాబాదులోని భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హకీంపేట వాయుసేన విమానాశ్రయం నుంచి నేరుగా భారత్ బయోటెక్ క్యాంపస్ కు వెళ్లారు. అక్కడ ఆయనకు సంస్థ వర్గాలు స్వాగతం పలికాయి. అనంతరం ప్రధాని అక్కడి పరిశోధనలపై సమీక్ష నిర్వహించారు. బయోటెక్ యాజమాన్యాన్ని, శాస్త్రవేత్తలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇప్పటికే అహ్మదాబాద్ లోని జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సిన్ పరిశోధనలను పరిశీలించిన ప్రధాని మోదీ, హైదరాబాద్ పర్యటన అనంతరం పూణే వెళ్లనున్నారు. అక్కడి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించనున్నారు.