ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఇదే!

28-11-2020 Sat 14:14
  • కళ్లుచెదిరే ధరతో బ్యాగు తయారుచేసిన ఇటలీ సంస్థ 
  • బ్యాగు ఖరీదు రూ.53 కోట్లు
  • బ్యాగు తయారీలో మొసలి చర్మం, వజ్రాలు వినియోగం
Here it is most expensive hand bag by Boarini Milanesi

ఓ హ్యాండ్ బ్యాగ్ కోసం రూ.300 నుంచి మహా అయితే ఓ రూ.1000 వరకు ఖర్చు చేయడంలో ఆశ్చర్యంలేదు. అయితే, సంపన్న వర్గాలు తమ స్థాయికి తగ్గట్టుగా లక్షల ఖరీదు చేసే డిజైనర్ హ్యాండ్ బ్యాగులు కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటలీకి చెందిన బోరిని మిలానేసి అనే లగ్జరీ లెదర్ ఉత్పత్తిదారు తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ ధర వింటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా 53 కోట్ల రూపాయలు. దీని ధరకు తగ్గట్టుగానే ఇది వజ్రవైఢూర్యాలతో, మరకత మాణిక్యాలతో తయారైంది.

బోరిని మిలానేసి సంస్థ ఇలాంటివి కేవలం మూడు బ్యాగులు మాత్రమే తయారుచేసిందట. ఈ కళ్లుచెదిరే హ్యాండ్ బ్యాగును మొసలి చర్మంతో తయారుచేశారు. దీనిపై మొత్తం 130 క్యారట్ల వజ్రవైఢూర్యాలు, అరుదైన మరకత మాణిక్యాలు పొదిగారు. తెల్ల బంగారంతో అందమైన సీతాకోకచిలుకలను తయారుచేసి దీనిపై అమర్చారు.

కాగా, ఈ ఖరీదైన హ్యాండ్ బ్యాగులను మహాసముద్రాల కాలుష్యంపై అవగాహన కలిగించడం కోసం తయారుచేసినట్టు బోరిని మిలానేసి సంస్థ వెల్లడించింది. ఈ బ్యాగుల అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును సముద్ర కాలుష్య నివారణకు వినియోగిస్తారట.