Tamil Nadu: గందరగోళ రాజకీయ నేత..  జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు

Tamil Media Slams Pawan Kalyan on his U turns
  • పవన్‌ నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టిన ‘తమిళ మురసు’
  • జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి యూటర్న్ తీసుకోవడంపై విమర్శలు
  • నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పవన్‌ తీరును తప్పుబట్టిన వైనం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్.. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ కూడా తాజాగా పవన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనప్పుడు పార్టీ ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కాగా, తాజాగా తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ మురసు’ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనను గందరగోళవాదిగా అభివర్ణించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆయనను ఇలానే అనుకుంటున్నారని రాసుకొచ్చింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ పార్టీ తొలుత నిర్ణయించిందని, అయితే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లను కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకుని యూటర్న్ తీసుకున్నారని విమర్శించింది. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, బీజేపీకి జనసేన మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారని వివరించింది. అంతేకాకుండా, అప్పటికే ప్రకటించిన అభ్యర్థులను వెనక్కి తీసుకుంటున్నట్టు పవన్ చెప్పారని పేర్కొంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ కూటమిలో చేరిన పవన్ పార్టీకి ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, ఆ తర్వాత మాయవతి నేతృత్వంలోని ఆ కూటమి నుంచి జనసేన బయటకు వచ్చిందని, అనంతరం బీజేపీతో పవన్ సంబంధాలు పెట్టుకున్నారని కథనంలో పేర్కొంది. దీంతో ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో తెలియని పవన్‌ను గందరగోళ రాజకీయ నేతగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు విమర్శిస్తున్నారని తమిళ మురసు తన కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News