మేం దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్టు నేడు కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తోంది: చంద్రబాబు

27-11-2020 Fri 19:59
  • వ్యాక్సిన్ తయారీలో జీనోమ్ వ్యాలీ  దూసుకుపోతోందని వెల్లడి
  • దేశాన్ని ముందు వరుసలో నిలిపిందన్న చంద్రబాబు
  • కొవాగ్జిన్ తో ఈ విషయం నిరూపితమైందంటూ వ్యాఖ్యలు
Chandrababu talks about Genome Valley

ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాదులోని జీనోమ్ వ్యాలీని సందర్శించడానికి వస్తుండడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని సమీక్షించేందుకు ప్రధాని వస్తున్నారని, గతంలో తాము దూరదృష్టితో చేపట్టిన జీనోమ్ వ్యాలీ ప్రాజెక్టు నేడు కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తోందని చంద్రబాబు తెలిపారు. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో దేశాన్ని ముందు వరుసలో నిలిపిందని పేర్కొన్నారు.

టీడీపీ ప్రభుత్వం అంకితభావంతో నిర్మించిన ప్రత్యేక పార్కు అని జీనోమ్ వ్యాలీని అభివర్ణించారు. దేశంలోని 150 లైఫ్ సైన్స్ క్లస్టర్లలో జీనోమ్ వ్యాలీ మొదటిదని వెల్లడించారు. మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు చక్కటి వసతి ఈ పార్కు అని వివరించారు. జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కొవాగ్జిన్ తో ఈ విషయం నిరూపితమైందని చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీలో ఉన్న భారత్ బయోటెక్ నిపుణులకు అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు.