KTR: మేమొస్తే ఉద్యోగాలు, వాళ్లొస్తే కర్ఫ్యూలు: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమదే విజయం అంటున్న కేటీఆర్
  • విద్వేషాలు రెచ్చగొట్టేవారికి బుద్ధి చెప్పాలని పిలుపు
  • హైదరాబాదును గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్న కేటీఆర్ 
KTR participates TV channel debate ahead of GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమదే విజయం అని ధీమా ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రశాంతనగరంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగర ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని, విద్వేషాలు పురిగొల్పే పార్టీ వస్తే కర్ఫ్యూలు వస్తాయి అని వ్యాఖ్యానించారు.

హైదరాబాదును గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత ఆరేళ్లలో రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇది తప్పు అని ఎవరైనా అంటే తాను దేనికైనా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్లోబల్ సిటీ అంటే రోడ్లు, బ్రిడ్జిలే కాదని, గ్లోబల్ సిటీ అంటే వీధి కుక్కలు, కాలుష్యంలేని నగరం అని కూడా భావించాల్సి ఉంటుందని, ఆ దిశగా హైదరాబాద్ ఇంకా విశ్వనగరంగా అవతరించలేదని అంగీకరిస్తున్నామని చెప్పారు. ఒక్కరోజులోనే అంతా మారిపోదని, దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఈ ఆరేళ్లలో తాము పన్నులు పెంచలేదని, ఇతర నగరాలు పన్నుల ద్వారా పొందుతున్న ఆదాయంతో హైదరాబాద్ ఆదాయాన్ని పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అన్నారు. ముంబయిలో ఆస్తి పన్ను ద్వారానే రూ.5 వేల కోట్ల వరకు వస్తుందని, బెంగళూరులో రూ.1900 కోట్లు వస్తుందని, అదే హైదరాబాదులో ఆస్తిపన్ను ద్వారా రూ.1300 కోట్లు వస్తుందని వివరించారు.

ఈ ఆరేళ్లలో తాము ఆస్తి పన్ను పెంచలేదని, వాటర్ బిల్లు పెంచలేదని, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదని, స్టాంపు డ్యూటీ పెంచలేదని, విద్యుత్ టారిఫ్ పెంచలేదని, డెవలప్ మెంట్ చార్జీలు, ట్రేడ్ లైసెన్సు చార్జీలు కూడా పెంచలేదని కేటీఆర్ తెలిపారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగిందంటే అందుకు కారణం ప్రత్యామ్నాయ మార్గాల్లో సమర్థ విధానాలను అమలు చేయడమేనని స్పష్టం చేశారు.

More Telugu News