Prakash Raj: అందరినీ బీజేపీకి ఓటేయాలని చెబుతున్నారు... ఇక జనసేన ఎందుకు?: పవన్ పై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

  • పవన్ ఓ ఊసరవెల్లి అంటూ వ్యాఖ్యలు
  • మరొకరి భుజాలపైకెక్కి రాజకీయాలెందుకన్న ప్రకాశ్ రాజ్
  • సొంత పార్టీ ఉండగా మరో పార్టీకి మద్దతెందుకని నిలదీసిన వైనం
Prakash Raj fires on Pawan Kalyan for supporting BJP

ఇటీవల జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తొలుత ప్రకటించి, ఆపై బీజేపీ అగ్రనేతలతో సమావేశం అనంతరం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభిమానులను, కార్యకర్తలను అందరినీ బీజేపీకి ఓటేయాలని చెబుతుంటే, ఇక జనసేన పార్టీ ఎందుకని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సొంత పార్టీ ఉన్న పవన్ కల్యాణ్ మరో పార్టీకి ఓటేయాలని చెప్పడం ఏంటో తనకు అర్థం కావడంలేదని అన్నారు.

"పవన్ ఓ పార్టీకి నాయకుడు... అలాంటప్పుడు తన పార్టీకి ఓట్లు అడగకుండా, మరో నాయకుడి వైపు వేలు చూపించి అతనికే ఓట్లు వేయాలని చెప్పడమేంటి? పవన్ కల్యాణ్ కు అసలేమైందో అర్థంకావడంలేదు. స్థిరత్వంలేని నిర్ణయాలతో ఊసరవెల్లిలా మారిపోయారు. 2014లో పవన్ బీజేపీని పొగిడారు. ఆ తర్వాత ఎన్నికల్లో వాళ్లను ద్రోహులని లెఫ్ట్ పార్టీలతో కలిశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లతో కలిశారు. ఇలా పూటకో మాట మార్చుతుంటే ఇంకేమనాలి?

జాతిహితం కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలంటున్నాడు. సొంత పార్టీ జనసేనను వదిలేసి మరో పార్టీ కోసం పనిచేయడం ఏంటో అర్థంకావడంలేదు. మరొకరి భుజాలపైకి ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు?" అంటూ నిశిత వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, కేసీఆర్ లా అవ్వాలంటే బీజేపీ వాళ్లు వెయ్యి జన్మలెత్తాలని, ఈసారి కేసీఆర్ బిజీగా ఉన్నారని, అందుకే ప్రజలే బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలని సూచించారు. ఆ పార్టీలకే కాకుండా ఆ పార్టీల వెంట వెళుతున్న మనవారికి కూడా బుద్ధి చెప్పాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News