రైతులను ఆదుకోండి... ఏపీ సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ!

27-11-2020 Fri 13:51
  • నివర్ తుపాను వల్ల రైతులకు భారీ నష్టం
  • అంతకుముందు కూడా భారీ వర్షాలు కురిశాయి
  • పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
  • వెంటనే పంట నష్ట పరిహారం అందజేయాలి
atchannaidu writes letter to jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాసి నివర్ తుపానుతో పాటు అంతకుముందు కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.  నివర్ తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయని, పలు జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు.

మరోవైపు ఆగస్టు నుంచి అక్టోబరు వరకు కురిసిన వర్షాలకు ప్రజలు రూ.9,720 కోట్ల మేరకు నష్టపోయారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను కనీసం పట్టించుకునే వారే లేరని తెలిపారు. అప్పులు తెచ్చి పంటలు సాగుచేసిన రైతులు వరుస విపత్తులతో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వారికి వెంటనే పంట నష్టం అందజేయాలని కోరారు.  

లక్షలాది ఎకరాలు నీట మునిగిపోవడంతో కష్టాల్లో ఉన్న ఆయా రైతులను ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. వారికి మనోధైర్యం చెప్పేవారు కూడా కరవయ్యారని పేర్కొన్నారు. వరద ఎంత వస్తుందో ముందే అంచనా వేసి తగిన జాగ్రత్తలు చేపట్టడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.