కేసీఆర్ ఎన్ని లేఖలు రాసినా కేంద్రం స్పందించలేదు: నామా నాగేశ్వరరావు

27-11-2020 Fri 13:24
  • తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోంది
  • టీఎస్ నుంచి వచ్చే పన్నులను ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తోంది
  • ఆరేళ్లలో హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం
Centre not responded to KCR letters says Nama Nageswar Rao

హైదరాబాదుకు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. గ్రేటర్ ఎన్నికల కోసం వరుసగా వస్తున్న బీజేపీ నేతలు వరదల సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్నికి ఎన్నో లేఖలు రాశారని... అయినా రాష్ట్రానికి కేంద్రం ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.

తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని నామా నాగేశ్వరరావు చెప్పారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు వరద సాయం చేసిన కేంద్రం... తెలంగాణకు మొండి చేయి చూపిందని దుయ్యబట్టారు. ఏమి అడిగినా ఇవ్వని బీజేపీకి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ ద్వారా వచ్చిన పన్నులను ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారని చెప్పారు. గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాదును అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని... ప్రజలు టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.