కంగన గురించి మాట్లాడేంత సమయం లేదు: ఉద్ధవ్ థాకరే

27-11-2020 Fri 13:19
  • ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చిన కంగన
  • ‘సామ్నా’ కోసం ఉద్ధవ్ థాకరే ఇంటర్వ్యూ
  • ఆమె గురించి మాట్లాడబోనని చెప్పిన ఉద్ధవ్
  • కొందరు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని విమర్శ
dont speak about kangana

మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ హీరోయిన్ కంగన రనౌత్  తరుచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. ముంబైని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుతో పోల్చుతూ ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ వంటి వారు ఆమె మాటలకు ఎదురుదాడి చేస్తుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాత్రం ఆమె గురించి మాట్లాడబోనని తెలిపారు. కంగన రనౌత్ వంటి వారి గురించి మాట్లాడేంత సమయం తనకు లేదని వ్యాఖ్యానించారు.

శివసేన పత్రిక ‘సామ్నా’ కోసం ఉద్ధవ్ థాకరేను సంజయ్ రౌత్‌ ఇంటర్వ్యూ చేయగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కంగనాకు సంబంధించిన విషయాల గురించి వదిలేయాలని, ఆమె గురించి తాను మాట్లాడాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే, ముంబైకి వ్యతిరేకంగా ఇటీవల కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి సంజయ్ రౌత్ మరోసారి ప్రశ్నించారు. ముంబైపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కడి పౌరులకు అవమానకరమని, దీనిపై కొందరు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని చెప్పారు.