విజయ్ దేవరకొండ సినిమాలో మలయాళ నటుడు!

27-11-2020 Fri 13:01
  • పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 
  • తండ్రీకొడుకుల సెంటిమెంట్ కూడా కీలకం
  • విజయ్ తండ్రి పాత్రకు సురేశ్ గోపి ఎంపిక
  • నాయికగా అనన్య.. త్వరలో తాజా షెడ్యూలు  
Suresh Gopi to play key role in Vijay Devarakondas movie

టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న యుకథానాయకుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ఓ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నాడు. కొన్ని రకాల పాత్రలకు పెట్టింది పేరైన ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి ఇప్పుడు విజయ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్ని కూడా వర్కింగ్ టైటిల్ గా వాడుతున్నారు. ఇందులో తండ్రీకొడుకుల సెంటిమెంట్ కూడా కీలకంగా వుందట. దాంతో విజయ్ తండ్రిగా సురేశ్ గోపీని తీసుకుంటున్నట్టు, ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

ఇక, లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన చాలా భాగం షూటింగ్ ముంబైలో జరిగింది. తాజా షెడ్యూలు షూటింగును త్వరలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తారు.