విధ్వంసం సృష్టించి.. బీజేపీపై నింద మోపాలనుకుంటున్నారు: బండి సంజయ్

27-11-2020 Fri 12:51
  • కేసీఆర్ స్క్రిప్టును డీజీపీ చదువుతున్నారు
  • పక్కా సమాచారం ఉన్నప్పుడు అరెస్ట్ చేయండి
  • జరగబోయే విధ్వంసాన్ని ఆపండి
Bandi Sanjay targets KCR and DGP

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీఎంతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డిని సంజయ్ టార్గెట్ చేశారు. హైదరాబాదులో మతకలహాలను రేకెత్తించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ఉందని చెపుతున్నారని... సమాచారం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈరోజు కుర్ముగూడ డివిజన్ లో సంజయ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

సీఎం రాసిచ్చిన స్క్రిప్టును డీజేపీ చదువుతున్నారని... ఇది దిక్కుమాలిన చర్య అని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పక్కా సమాచారం ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలని, జరగబోయే విధ్వంసాన్ని ఆపాలని అన్నారు. ప్రజలను భయపెట్టి, నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. విధ్వంసం సృష్టించి ఆ నిందను బీజేపీపై మోపేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి రోహింగ్యాలను తరిమికొడతామని చెప్పారు. దేశం కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీనే అని అన్నారు.