నెల్లూరు జిల్లాలో పరిస్థితి తీవ్రం... చెన్నైకి రాకపోకలు బంద్!

27-11-2020 Fri 09:22
  • ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కైవల్యా నది
  • 40 కిలోమీటర్ల మేరకు నిలిచిన ట్రాఫిక్
  • చిత్తూరు జిల్లాలోనూ అదే పరిస్థితి
Nellore to Chennai Transport Effected due to Niver

నిన్న తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను, ఆపై క్రమంగా కదులుతూ ప్రస్తుతం రాయలసీమపై కేంద్రీకృతమై ఉండగా, నెల్లూరు జిల్లాలో కురిసిన అతి భారీ వర్షంతో చెన్నైకి రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గూడూరు వద్ద కైవల్యా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. నెల్లూరు నుంచి కోట క్రాస్ రోడ్డు వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో తమ తమ గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులంతా రోడ్లపైనే నిలిచిపోయారు.

భారీ వర్షాల కారణంగా దాదాపు 40 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిందంటే, నివర్ పరిస్థితి ఎంత బీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గంగినేని చెరువు పొంగిపొరలుతుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి, మినీ బోట్ల సాయంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా, తీరం దాటిన తరువాత క్రమంగా బలహీనపడుతూ వచ్చిన నివర్ తుపాను, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం రూపంలో ఉంది. ఈ మధ్యాహ్నం తరువాత ఇది వాయుగుండంగా, ఆపై సాయంత్రానికి తీవ్ర అల్ప పీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఆకాశం పూర్తి మేఘావృతమై ఉంటుందని అన్నారు.