Love Jihad: ముస్లిం యువకులు హిందూ యువతులను తమ అక్కాచెల్లెళ్లలా భావించాలి: ఎస్పీ ఎంపీ వ్యంగ్యం

  • ‘లవ్ జిహాద్’ ఆర్డినెన్స్‌పై ప్రతిపక్షాల విమర్శలు
  • లవ్ అంటే లోపలేసి తోముతారన్న ఎస్పీ ఎంపీ
  • నిరుద్యోగం, పేదరికంపై దృష్టిసారించాలన్న ప్రతిపక్షాలు
Moradabad SP MP ST Hasan asks Muslim boys to consider Hindu girls their sisters

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘లవ్‌ జిహాద్’కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై సమాజ్‌వాదీ పార్టీ మొరాదాబాద్ ఎంపీ ఎస్‌టీ హసన్ వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇకపై ముస్లిం యువకులు హిందూ యువతులను తమ అక్కాచెల్లెళ్లలా భావించాలని, కాదని ప్రేమ, పెళ్లి అంటే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ కింద అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతుందని అన్నారు.

దేశంలో ఎవరికైనా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు ఉందన్న ఆయన.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాజకీయ స్టంట్‌గా కొట్టిపడేశారు. హిందూ ముస్లింలు వివాహాలు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. దురదృష్టవశాత్తు వారి మధ్య విభేదాలు వస్తే.. అప్పుడు 'వరుడు ముస్లిం కాబట్టే ఇదంతా..' అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం మొదలుపెడతారని ఎంపీ అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం కావాలనే హిందూముస్లింల మధ్య ఎడం పెంచుతోందని హసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇక నుంచి హిందూ యువతులను మీ అక్కాచెల్లెళ్లలా భావించాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముస్లిం యువకులను హెచ్చరించారు. కాగా, ప్రభుత్వం ‘లవ్ జిహాద్’ మీద కాకుండా నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలపై దృష్టిపెడితే బాగుంటుందని కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు చురకంటిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News