'ఆచార్య' షూటింగులో చరణ్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..!

26-11-2020 Thu 21:32
  • ఇటీవలే తిరిగి మొదలైన 'ఆచార్య' షూటింగ్
  • ప్రత్యేక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్
  • త్వరలోనే జాయిన్ కానున్న చిరంజీవి
  • జనవరి మూడో వారం నుంచి చరణ్ షూట్
Ram Charan will join Acharya shoot in January

లాక్ డౌన్ కారణంగా ఎఫెక్ట్ అయిన సినిమాలలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా కూడా వుంది. లాక్ డౌన్ కి ముందు కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం గత ఏడు నెలలుగా ముందుకు కదలలేదు. ఇటీవలే ఈ చిత్రం షూటింగును తిరిగి హైదరాబాదులో ప్రారంభించారు. అయితే, హీరో చిరంజీవి ఇంకా షూటింగులో జాయిన్ కాలేదని తెలుస్తోంది. త్వరలోనే ఆయన షూట్ లో చేరతారని భావిస్తున్నారు.

ఇదిలావుంచితే, ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి విదితమే. మరోపక్క, ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నందున ఇంకా 'ఆచార్య'లో పాల్గొనలేకపోతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం, జనవరి మూడో వారం నుంచి చరణ్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడట. అక్కడి నుంచి ఏకబిగిన షూటింగులో పాల్గొని తన పార్ట్ పూర్తిచేస్తాడని అంటున్నారు.

ఇక చిత్రకథానాయిక కాజల్ అగర్వాల్ డిసెంబర్ 5 నుంచి ఈ చిత్రం షూటింగులో పాల్గొంటుంది. చిరంజీవితో వుండే కాంబినేషన్ సన్నివేశాలను ముందుగా చిత్రీకరించడానికి దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.