ఐసీసీ కొత్త చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే ఎన్నిక

25-11-2020 Wed 19:54
  • ముగిసిన శశాంక్ మనోహర్ పదవీకాలం
  • ఎన్నికల్లో ఇమ్రాన్ ఖవాజాపై ఆధిక్యం
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న బార్ క్లే
Greg Barcley elected as new ICC Chairman

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి కొత్త చైర్మన్ వచ్చాడు. చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నూతన చైర్మన్ కోసం ఎన్నిక జరిగింది. ఐసీసీ నిబంధనలను అనుసరించి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన గ్రెగ్ బార్ క్లే ఐసీసీ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించనున్నాడు. గ్రెగ్ బార్ క్లే ఇప్పటివరకు ఐసీసీలో న్యూజిలాండ్ ప్రతినిధిగా వ్యవహరించారు.

గత జూలైతో శశాంక్ మనోహర్ రెండేళ్ల పదవీకాలం ముగియడంతో ఇమ్రాన్ ఖావాజా తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖవాజా, గ్రెగ్ బార్ క్లే పోటీపడ్డారు. కీలకమైన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మద్దతు తెలపడంతో బార్ క్లే విజయం ఖాయమైంది.

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన ఐసీసీలో న్యూజిలాండ్  క్రికెట్ ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. బార్ క్లే రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతారు.

కాగా, ఎన్నిక ద్వారా ఐసీసీ చైర్మన్ గా గెలిచిన వారిలో బార్ క్లే రెండో వ్యక్తి. తొలుత శశాంక్ మనోహర్ స్వతంత్రంగా ఎన్నికల్లో నెగ్గి చైర్మన్ అయ్యారు. గతంలో క్రికెట్ బోర్డులు రొటేషన్ పద్ధతిలో ఐసీసీ చైర్మన్ గా తమకు అనుకూలమైన వ్యక్తులను నామినేట్ చేసే విధానం ఉండేది. అటు, ఐసీసీ కొత్త  చైర్మన్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది.