ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన దుస్థితి తెలంగాణలో ఉంది: స్వామిగౌడ్

25-11-2020 Wed 19:52
  • ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే టీఆర్ఎస్ ను వీడాను
  • ఉద్యమకారుల విషయంలో కేసీఆర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారు
  • కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం కనీసం వంద సార్లు ప్రయత్నించా
Swamy Goud comments on KCR after joining BJP

టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వారికి పార్టీలో ప్రాధాన్యతను ఇస్తున్నారని... ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అగ్రతాంబూలం ఇస్తున్నారని చెప్పారు.

కనీస మర్యాదకు కూడా తెలంగాణ ఉద్యమకారులు నోచుకోలేదా? అని స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిగా భావించే కేసీఆర్ ఈ విషయంలో అలసత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. గత రెండేళ్ల కాలంలో కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం కనీసం వందసార్లు ప్రయత్నించానని... కానీ, ఫలితం లేకపోయిందని చెప్పారు. వారం క్రితం కూడా ఆయనను కలిసేందుకు ప్రయత్నించానని తెలిపారు. కేసీఆర్ ఎవరినీ కలవరని చెప్పారు. ఆయన చుట్టూ పీఏలు మాత్రమే ఉంటారని అన్నారు.

తెలంగాణ సాధించుకున్న ఆరేళ్ల తర్వాత కూడా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే టీఆర్ఎస్ ను వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసమే బీజేపీలో చేరానని అన్నారు. బీజేపీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్టుందని చెప్పారు. తన మాతృ సంస్థగా బీజేపీని భావిస్తున్నానని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు.