Corona Virus: డిసెంబర్ 1 నుంచి సరికొత్త కరోనా మార్గదర్శకాలు.. విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

Centre Issues New COVID 19 Guidelines For States From December 1
  • కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్ డౌన్ కు అనుమతి తప్పనిసరి
  • మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించండి
  • 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించి, మహమ్మారి కట్టడికి కృషి చేయాలని తెలిపింది. గుంపులుగా గుమికూడే జనాలపై అదనపు జరిమానాలు విధించుకోవచ్చని... అయితే, కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మాత్రం లాక్ డౌన్ విధించాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని... ఈ బాధ్యత జిల్లా యంత్రాంగం, పోలీసులదేనని చెప్పింది.  

మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కేంద్రం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని సూచించింది. మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించాలని చెప్పింది. ఆరోగ్యసేతు యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించింది.

కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చుకోవచ్చని కేంద్రం తెలిపింది. 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించాలని తెలిపింది. స్విమ్మింగ్ పూల్స్ ను కేవలం క్రీడాకారుల శిక్షణ నిమిత్తమే అనుమతించాలని చెప్పింది. విద్య, వినోదం, క్రీడలు, ఆధ్యాత్మిక, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు 50 శాతం సామర్థ్యంతో హాల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. ఇతర సామూహిక కార్యక్రమాలకు 200కు మించి అనుమతి లేదని చెప్పింది.
Corona Virus
New Covid Guidelines
Union Home Ministry

More Telugu News