టీఆర్ఎస్ తీరుపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శలు

25-11-2020 Wed 13:18
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేశామంటూ టీఆర్ఎస్ అబద్ధాలు
  • హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీకి మద్దతు తెలపాలి
  • పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారు?
smriti irani slams trs

అభివృద్ధి కోసం గడిచిన ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ అసత్యాలు చెబుతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక ఎన్నికల నేపథ్యంలో  స్మృతి ఇరానీ ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చి బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు తమ పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని ఆమె నిలదీశారు. రోహింగ్యాలు, బంగ్లా దేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు ఇచ్చారని, ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు మాట్లాడవని ఆమె నిలదీశారు.

సుమారు 75,000 మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ నగరంలో ఎలా నివసిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని అక్రమ చొరబాటు దారుల నుంచి బీజేపీ కాపాడుతుందని అన్నారు. తాము అందరితో కలిసి అందరి వికాసం కోసం పనిచేస్తామని చెప్పారు. వరద సాయంపై కేంద్ర సర్కారుకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని ఆమె చెప్పారు.