Faheem: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఫహీమ్ అరెస్ట్.. గుర్గావ్ లో పట్టుకున్నామన్న సజ్జనార్!

  • పలు రాష్ట్రాల్లో దొంగతనాలు, దోపిడీలు
  • ఇక్కడి ఫిర్యాదులపై విచారణ
  • గుర్గావ్ వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం 
Most wanted Criminal Arrested by Hyderabad Police

ఉత్తరప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గడచిన మూడు సంవత్సరాల్లో ఎన్నో దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్ స్టర్ ఫహీమ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఫహీమ్ బృందం హైదరాబాద్ లోని మేడ్చల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫహీమ్ తో పాటు అతని ముఠాను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్గావ్ లో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.

ఫహీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన, మొరాదాబాద్ జిల్లాకు చెందిన గ్లాస్ కటింగ్ పని చేసే ఫహీమ్, 2013లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్ట్ అయి మురాదాబాద్ జైలుకు వెళ్లాడు. జైలులో అతనికి మహమ్మద్ ముర్సలిమ్ తో స్నేహం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరూ కలిసి గురుగ్రామ్ లో తమకు తెలిసిన వ్యాపారాన్నే ప్రారంభించారు. అయితే, తమ లగ్జరీలకు కావాల్సినంత ఆదాయం రాకపోవడంతో దోపిడీలకు తెర లేపారు.

ఆపై ముర్సలిమ్ స్నేహితుడు ఆరిఫ్ కూడా కలవగా, గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, ఏపీల్లో పలు చోరీలు చేశాడు. దాదాపు 100కు పైగా చోరీల్లో ఇతను నిందితుడు. పలు రాష్ట్రాల్లో ఫహీమ్ పై కేసులున్నాయి. తరచూ నివాసాలు మార్చుతూ ఉండటంతో ఎక్కడా పట్టుబడలేదు. పైగా దొంగిలించిన బంగారాన్ని బిస్కెట్లుగా మార్చి మార్కెట్లో అమ్మేవాడు.

ఇక ఈ నెల 4వ తేదీన మేడ్చల్, ఆల్వాల్ పరిధిలో రెక్కీ నిర్వహించిన ఈ టీమ్, తమ దొంగతనాలను కంటిన్యూ చేస్తూ, ఆపై కర్ణాటకలో కొన్ని దొంగతనాలు చేసి, గురుగ్రామ్ చేరుకున్నారు. ఏ రాష్ట్రంలోకి ఎంటరైతే, ఆ రాష్ట్రానికి చెందిన కార్ నంబర్ ను తమ వాహనానికి అమర్చుకుంటూ ముందుకు సాగుతూ పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరించారు.

అయితే, హైదరాబాద్ లో వీరు దొంగతనాలు చేసిన ప్రాంతాల్లో లభించిన శాస్త్రీయ ఆధారాలతో పోలీసులు విచారణ ప్రారంభించగా, వీరి గత నేరాల గురించి సైబరాబాద్ పోలీసులకు ఉప్పందింది. దీంతో ఎఓటీ ఇనస్పెక్టర్ రమణారెడ్డి నేతృత్వంలోని బృందం గుర్గావ్ కి వెళ్లింది. అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ఫహీమ్ తో పాటు ముర్సలీమ్ లను అరెస్ట్ చేసింది.

గుర్గావ్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాలో తలదాచుకున్న ఇతన్ని అదుపులోకి తీసుకున్నామని సజ్జనార్ తెలిపారు. దొంగతనాలు, దోపిడీలతో వచ్చిన సొమ్ముతో ఇతని టీమ్ విలాసవంతమైన జీవనాన్ని గుడుపుతోందని ఆయన తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అన్నారు.

More Telugu News