Nivar Cyclone: తరుముకొస్తున్న నివర్... నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు మూడ్రోజుల సెలవులు

Three days holiday announced in Nellore district due to Nivar cyclone
  • ఈ సాయంత్రం తీరం దాటనున్న నివర్
  • నెల్లూరుకు ప్రమాద హెచ్చరిక జారీ
  • రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం
  • ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు
తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపుతున్న నివర్ తీవ్ర తుపాను ఈ సాయంత్రం నుంచి ఏపీ దక్షిణ కోస్తా జిల్లాలపై పంజా విసరనుంది. నేటి సాయంత్రం తర్వాత నివర్ తమిళనాడులోని కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్యన అతి తీవ్ర తుపాను స్థాయిలో తీరం దాటనుంది. నివర్ ప్రభావం ఏపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాపై ఉంటుందని భావిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాలో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. అదే సమయంలో అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.

నివర్ తీరం దాటిన తర్వాత నెల్లూరుతో పాటు చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.
Nivar Cyclone
Nellore District
Holidays
Educational Institutions
Tamilnadu
Andhra Pradesh

More Telugu News