కుమార్తె పెళ్లికోసం దాచిన రూ.9.20 లక్షలు బుగ్గిపాలు... కన్నీరుమున్నీరైన కుటుంబం!

24-11-2020 Tue 21:18
  • శ్రీకాకుళం జిల్లాలో అగ్నిప్రమాదం
  • కాలిబూడిదైన రెండు ఇళ్లు
  • నగదుతో పాటు విలువైన వస్తువులు దగ్ధం
Fire accident in Srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో అత్యంత విచారకర ఘటన చోటుచేసుకుంది. కొత్తూరు మండలం హంస కాలనీలో ఇవాళ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వారాడ కృష్ణమూర్తి అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కృష్ణమూర్తి తన కుమార్తె పెళ్లి కోసం దాచి ఉంచిన రూ.9.20 లక్షల నగదు, 7 తులాల బంగారు నగలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల డబ్బు కళ్లముందే కాలిబూడిదవుతుంటే ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతం.

ఇంట్లో డబ్బు, నగలతో పాటు టీవీ, ఇతర విలువైన వస్తువులు కూడా దగ్ధమయ్యాయి. ముఖ్యంగా, కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు కాలిపోవడంతో ఆ కుటుంబం తీవ్రంగా రోదిస్తోంది. కాగా, అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే తీవ్ర నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వారాడ కృష్ణమూర్తి నివాసంతో పాటు బొడ్డు గోపాల్ అనే వ్యక్తి ఇల్లు కూడా కాలిపోయింది.