చిత్ర పరిశ్రమ కోసం ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి: గీతా ఆర్ట్స్

24-11-2020 Tue 20:53
  • అనేక ఉపశమన చర్యలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ గీతా ఆర్ట్స్ ప్రకటన
  • కేసీఆర్ నిర్ణయాలపై ప్రశంసలు
Geetha Arts expresses gratitude to CM KCR

తెలంగాణ ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఉపశమన చర్యలతో తెలుగు సినీ రంగం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. సినిమా థియేటర్ల పునఃప్రారంభం, టికెట్ రేట్లు సవరించుకునేందుకు అనుమతి వంటి ఉపశమన చర్యలతో సీఎం కేసీఆర్ సినీ జనాల మనసు దోచుకున్నారు. తాజాగా దీనిపై ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ స్పందించింది. జూనియర్ ఆర్టిస్టులతో సహా 40 వేల మంది సినీ కార్మికులకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గీతా ఆర్ట్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

చిన్న సినిమాలకు 9 శాతం జీఎస్టీ రీయింబర్స్ మెంట్ నిర్ణయం ఎంతో అభినందనీయం అని పేర్కొంది. "తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించే క్రమంలో ఏపీ ప్రభుత్వానికి మాదో విన్నపం. చిత్ర పరిశ్రమకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఇక, సినీ పరిశ్రమ కష్టాలను తెలంగాణ ప్రభుత్వానికి వివరించి, సానుకూల ఫలితాలు అందించిన చిరంజీవి, నాగార్జున, ఇతర సినీ పెద్దలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం" అంటూ గీతా ఆర్ట్స్ తన ప్రకటనలో వివరించింది.