Brahmos: పరిధి పెంచినా గురితప్పని బ్రహ్మోస్... మరో పరీక్షలోనూ సక్సెస్

Brahmos successfully test fired
  • బ్రహ్మోస్ వాస్తవ పరిధి 290 కిమీ
  • 400 కిమీకి పెంచిన శాస్త్రవేత్తలు
  • భూ ఉపరితలం నుంచి ప్రయోగించిన శాస్త్రవేత్తలు
భారత అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం అవుతుందని భావిస్తున్న బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైల్ ను మరోసారి విజయవంతంగా పరీక్షించారు. అండమాన్ నికోబార్ లో చేపట్టిన ఈ ప్రయోగానికి ఓ విశిష్టత ఉంది. సాధారణంగా బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు కాగా, ఈసారి ఆ పరిధిని 400 వరకు పెంచారు. అయినప్పటికీ గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించి శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు నింపింది. ఈ సూపర్ సానిక్ క్షిపణి శబ్దవేగానికి 3 రెట్లు అధికంగా 2.9 మాక్ ల వేగంతో దూసుకెళ్లి లక్ష్యాన్ని తుత్తునియలు చేసింది.

ఇవాళ నిర్వహించిన పరీక్షలో భూ ఉపరితలం నుంచి బ్రహ్మోస్ ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. తదుపరి గగనతలం నుంచి, యుద్ధ నౌకల నుంచి బ్రహ్మోస్ ను పరీక్షిస్తామని చెప్పారు. ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్ ను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భూ, గగనతల, జల ఉపరితలాల నుంచి ప్రయోగించే వీలున్న బ్రహ్మోస్ ను కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
Brahmos
Supersonic
Cruise Missile
India

More Telugu News