గ్రేటర్ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్

24-11-2020 Tue 19:46
 • జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం
 • అనేక అంశాలతో మేనిఫెస్టో
 • విడుదల చేసిన మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్
Congress party releases manifesto for GHMC elections

దుబ్బాక ఉప ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలంగా పోరాడాలని నిశ్చయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు మేనిఫెస్టోకు రూపకల్పన చేసింది. ఇవాళ గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల సంభవించిన వరదల నుంచి నగరంలోని డివిజన్లలో లైబ్రరీలు, రీడింగ్ రూమ్ ల వరకు అనేక అంశాలకు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చోటిచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స, వరద బాధితులకు రూ.50 వేల సాయం వంటి అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. అంతేకాదు, సినిమా ప్రదర్శనలకు సంబంధించిన అంశాలను కూడా స్పృశించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే...

 • అర్హత కలిగిన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు. స్థలం ఉంటే ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షలు. సింగిల్ బెడ్రూం ఉంటే మరో బెడ్రూం నిర్మాణం కోసం రూ.4 లక్షలు. ఇల్లు పూర్తయ్యేవరకు అద్దె ఇంట్లో ఉండేందుకు రూ.60 వేలు అందజేత.
 • ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్స.
 • జీహెచ్ఎంసీ పరిధిలో 100 యూనిట్ల లోపు వినియోగించేవారికి రాయితీ.
 • 80 గజాల కంటే తక్కువ స్థలంలో ఇల్లు ఉంటే ఆస్తి పన్ను రద్దు.
 • ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ సేవలు.
 • ధరణి పోర్టల్ రద్దు.
 • ఉచితంగా నల్లా కనెక్షన్... 30 వేల లీటర్ల వరకు మంచినీరు ఫ్రీ.
 • సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పన్ను తగ్గింపు. మల్టీప్లెక్స్ లో, మాల్స్ లో సినిమా టికెట్ల ధరల నియంత్రణ.
 • కరోనా ప్రభావంతో దెబ్బతిన్న వర్గాలకు నిరుద్యోగ భృతి.
 • సఫాయీ కర్మచారీలు, వారి కుటుంబసభ్యులకు రూ.20 లక్షల బీమా
 • ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు నియంత్రణకు చర్యలు.
 • మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు ఉచితంగా మెట్రో, ఎంఎంటీఎస్  ప్రయాణం.
 • వృద్ధుల కోసం ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు.