మాకు, జిన్నాకు ఏం సంబంధం ఉంది?: అసదుద్దీన్ ఒవైసీ

24-11-2020 Tue 19:43
  • పాతబస్తీలో పాకిస్థానీలు ఎక్కడున్నారో చెప్పండి
  • పాకిస్థాన్, టెర్రరిస్ట్ అనే పదాలు లేకుండా ప్రచారం చేయగలరా?
  • బీజేపీలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది
What relation we have with Jinnah asks Owaisi

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని... అక్కడున్న రోహింగ్యాలు, పాకిస్థానీలను తరిమికొడతామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ స్పందించారు. 24 గంటల సమయం ఇస్తామని... పాకిస్థాన్ వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా భారతీయులేనని చెప్పారు. మన దేశానికి చెందిన 970 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని... అమిత్ షా ముందు అక్కడకు వెళ్లి సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని అన్నారు.

బెంగళూరు నుంచి ఒక బీజేపీ ఎంపీ వచ్చి తనను జిన్నాతో పోల్చారని... తమకు, జిన్నాకు ఏం సంబంధమని ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని అన్నారు. పాకిస్థాన్, టెర్రరిస్ట్ అనే పదాలు లేకుండా ఈ నెల 29వ తేదీ వరకు ప్రచారం చేయగలరా? అంటూ బీజేపీ, ఆరెస్సెస్ కి సవాల్ విసిరారు. ఈ పదాలు వాడకుండా అభివృద్ధి, విద్య గురించి చెప్పి గెలవాలని ఛాలెంజ్ చేశారు. హైదరాబాదును భాగ్యనగరం చేస్తామంటున్నారని... హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడో పేరు వచ్చిందని అన్నారు. ఈ దేశం నుంచి ముస్లింలను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు.