ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు: హిందూ, ముస్లిం జంట వివాహంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

24-11-2020 Tue 13:26
  • హిందువా, ముస్లిమా? అనే విషయం న్యాయస్థానం చూడదు
  • వారు మేజర్లా? కాదా? అన్న అంశమే ముఖ్యం
  • మేజర్లకు జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది   
  • జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదన్న హైకోర్టు   
they are majors says high court

దేశ వ్యాప్తంగా ‘లవ్‌ జిహాద్’పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పెళ్లి కేసుల్లో అమ్మాయి లేదా అబ్బాయి హిందువా, ముస్లిమా? అనే విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోదని, వారు మేజర్లా? కాదా? అన్న అంశమే ముఖ్యమని అలహాబాద్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మేజర్లకు వారి జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా లవ్ జిహాద్‌పై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో అలహాబాద్ కోర్టు మతాంత వివాహం విషయంలో ఈ కీలక తీర్పు నిచ్చింది.  

ఇద్దరు మేజర్ల మధ్య బంధాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడానికి వీల్లేదని తెలిపింది. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ ముస్లిం యువకుడిపై నమోదైన కేసుపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. యూపీలోని కుషీనగర్‌కు చెందిన సలామత్‌ అన్సారీ అనే ముస్లిం యువకుడు అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక ఖన్వార్‌ కొన్నేళ్లుగా ప్రేమించుకుని, 2019 ఆగస్టులో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.

అయితే, వివాహానికి ముందు ప్రియాంక మతం మారడం గమనార్హం. తన పేరును ఆమె అలియాగా మార్చుకుంది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, మైనర్‌ అయిన తన కుమార్తెను బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి జరిపించారంటూ సలామత్‌, మరో ముగ్గురిపై పోస్కో చట్టం కింద కేసు పెట్టాడు. దీంతో సలామత్ తో పాటు ప్రియాంక, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు.

తమపై పెట్టిన కేసును కొట్టేయాలని, అలాగే తమకు రక్షణ కల్పించాలని కోరారు. పెళ్లి చేసుకున్న సమయంలో ప్రియాంక వయసు 21 అని తేలింది. ఆమె మైనర్‌ కాదని స్పష్టం చేస్తూ.. ఆమె తన భర్తతో కలిసి జీవించేందుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పింది. మేజర్లయిన ఇద్దరు వ్యక్తులు బంధాన్ని ఏర్పరుచుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. అయితే, మత మార్పిడి పెళ్లిళ్ల చెల్లుబాటు అంశంపై తాము ఇప్పుడు స్పందించబోమని పేర్కొంది.