సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉపశమన చర్యలతో కచ్చితంగా టాలీవుడ్ మళ్లీ పుంజుకుంటుంది: రాజమౌళి

24-11-2020 Tue 13:18
  • సినీ రంగానికి ఊరట కలిగించే చర్యలు ప్రకటించిన సీఎం కేసీఆర్
  • టాలీవుడ్ లో వెల్లివిరుస్తున్న హర్షం
  • సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి
Rajamouli thanked CM KCR for relief measures towards Telugu Film Industry

కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించడంతో భారీగా నష్టపోయిన రంగాల్లో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. మార్చి నుంచి షూటింగులు, సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంతో ఇండస్ట్రీ స్తంభించిపోయింది. ఇటీవలే షూటింగులు ప్రారంభం కావడంతో సినీ జనాల్లో కాస్తంత ఉత్సాహం కనిపిస్తోంది. నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఊరట చర్యలతో వారిలో సంతోషం పెల్లుబుకుతోంది.

దీనిపై టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో అవసరమైన దశలో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉపశమన చర్యలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆనందం పొంగిపొర్లుతోందని తెలిపారు. ఈ నిర్ణయాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కచ్చితంగా మళ్లీ పుంజుకుని అభివృద్ధి పథంలో నడుస్తుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. "మీకు కృతజ్ఞులమై ఉంటాం కేసీఆర్ సర్" అంటూ ట్వీట్ చేశారు.