రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారు?: అసదుద్దీన్ ఒవైసీ

24-11-2020 Tue 12:57
  • ఎంఐఎంకు ఓటేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందని బీజేపీ అంటోంది
  • ఓటర్ల జాబితాలో 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారంటున్నారు
  • మరి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారు?
owaisi slams bjp

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్తోన్న బీజేపీనే లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. తాజాగా ఆయన  ఓ సభలో మాట్లాడుతూ...  కేంద్ర మంత్రి జవదేకర్ హైదరాబాద్‌కు వచ్చారని, ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందని అన్నారని ఒవైసీ పేర్కొన్నారు.

అంతేగాక, ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ ఆరోపణలు చేస్తోందని, 30,000 మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని, అమిత్ షా ఎందుకు విచారణ జరిపించట్లేదని ఆయన అడిగారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని ఆయన అన్నారు.