ముఖ్యమంత్రులతో మొదలైన మోదీ సమావేశం... తొలుత మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్!

24-11-2020 Tue 12:00
  • రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ప్రధాని
  • నేడు 8 రాష్ట్రాల సీఎంలతో సమావేశం
  • ఢిల్లీలో కేసులు తగ్గుతున్నాయని తెలిపిన కేజ్రీవాల్
Narendra Modi Talks to Aravind Kejriwal on Corona

ఇండియాలో కరోనా కేసుల తీవ్రత, డిసెంబర్ లో అమలు కావాల్సిన తదుపరి దశ అన్ లాక్ లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, దాని పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో సమావేశం ప్రారంభమైంది. వర్చ్యువల్ విధానంలో ఈ మీటింగ్ జరుగుతుండగా, తొలుత కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో మోదీ విడివిడిగా మాట్లాడనున్నారు.

ఈ ఉదయం సమావేశం ప్రారంభం కాగా, తొలుత మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించారు. నవంబర్ 10న రికార్డు స్థాయిలో ఒక రోజులో 8,600 కొత్త కేసులు వచ్చాయని పేర్కొన్న కేజ్రీవాల్, ఆపై క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతోందని గుర్తు చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకున్నదని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచామని, అవసరమని భావిస్తే, మరిన్ని కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమని ఆయన తెలిపారు.

కాగా, ఈ సమావేశంలో తదుపరి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల సీఎంలతో మోదీ మాట్లాడనున్నారు. ఈ సమావేశం అనంతరం కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై మోదీ ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మిగతా ప్రాంతాల్లోని కంటైన్ మెంట్ జోన్లు మినహా, అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను, ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేలా నిర్ణయాలు వెలువడతాయని అంచనా.